Tuesday 16 February 2016

ఔటర్ రింగు రోడ్డులో మరో ప్రమాదం


ఔటర్ రింగు రోడ్డులో మరో ప్రమాదం

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ మృతి

కారులోనుంచి ఎగిరి పడి మరి ఇద్దరు విద్యార్థులు మృతి

హైదరాబాద్, డిసెంబర్ 20 : ఔటర్ రింగు రోడ్డుపై మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించాడు. ప్రతీక్‌తో పాటు అదే కారులో ప్రయాణిస్తున్న మరి ఇద్దరు సి.బి.ఐ.టి. విద్యార్థులు కూడా మరణించారు. వీరంతా 19 ఏళ్ల యువకులు.
మరణించిన ఆ ఇద్దరి పేర్లు చంద్రారెడ్డి, సుజిత్ రెడ్డి అని తెలుస్తున్నది. ఈ సంఘటనలో అవరోహన్ రెడ్డి అనే మరో విద్యార్థికి తీవ్ర గాయాలు తగులగా అతడిని ఆస్పత్రిలో చికిత్సకోసం చేర్పించారు. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు ఎం.పి. రాజగోపాల్‌రెడ్డి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల తెలంగాణాకోసం దీక్ష చేసినప్పుడు కూడా ప్రతీక్ ఆ ప్రక్కనే కూర్చుని కనిపించాడు. ప్రతీక్ మృతితో నల్గొండలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రతీక్ మృతికి ముఖ్యమంత్రి కిరణ్, పి.సి.సి. అధ్యక్షుడు బొత్స, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కె.సి.ఆర్, స్పీకర్ నాదెండ్ల మనోహర్, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, ఇంకా కె.పి.పి, బాలూ నాయక్, వి.హనుమంతరావు, ఆనం సోదరులు, శత్రుచర్ల, బాలరాజు, చిరుమర్తి లింగయ్య, డి.ఎల్. బాలరాజు ప్రభృతులు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రమాదానికి గురైన స్కోడా కారు వెంకటరెడ్డి బంధువు పోరెడ్డి నరసింహారెడ్డికి చెందినదిగా గుర్తించారు. ఈ కారులో వారు సి.బి.ఐ.టి.నుంచి పటాన్‌చెరువైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తున్నది. మెదక్ జిల్లా రామచంద్రాపురం మండ లం కొల్లూరు వద్ద ఒక డివైడర్‌ను ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న గొర్రెలమందను తప్పించడానికి ఆకస్మికంగా బ్రేకులు వేయడంతో కారు డివైడర్‌ను కొట్టినట్టు తెలుస్తున్నది. వీరు ఎ.పి. 24 ఎ.హెచ్. 9999 నంబరు గల స్కోడా కారులో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తున్నది. సంఘటన జరిగినప్పుడు కారు అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. కారు నాలుగు పల్టీలు కొట్టినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో ప్రతీక్ రెడ్డి కారు నడుపుతున్నట్టు తెలుస్తున్నది. బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రతీక్ రెడ్డికి వారం రోజుల క్రితమే ఒక ప్రమాదం తప్పినట్టు తెలుస్తున్నది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ఉదయం కుమారుని కాలేజి వద్ద విడిచిపెట్టి తాను ఢిల్లీ వెళ్లారు. ప్రమాదం సంభవించిన వెంటనే కారులోపలనుంచి ఏర్ బ్యాగ్స్ ముందుకు వచ్చాయి. అయితే కారు నాలుగు పల్టీలు కొట్టడంతో కారు చాలా వేగంగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తున్నది. కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాద తీవ్రతకు కారు లోపల ప్రయాణిస్తున్న యువకులు రోడ్డు మీదికి ఎగిరిపడ్డారు. దాన్ని బట్టి వీరు సీటు బెల్టులు పెట్టుకోనట్టు తెలుస్తున్నది. ఆ ప్రాంతంలో వేగ నియంత్రణ యంత్రాంగం ఏమీ లేకపోవడంవల్ల ఔటర్ రింగు రోడ్డు మృత్యు రహదారిగా మారిందని విమర్శలు వస్తున్నాయి.
ఈ దుర్ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందవలసి ఉంది. ఈ రోడ్డుపై ట్రాఫిక్ తక్కువ ఉండడంవల్ల వాహనాలు వేగంగా వెళ్లడంగాని, బ్రేకు సకాలంలో పడకపోవడం గాని ఇటువంటి ప్రమాదాలకు కారణంగా ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కూడా బైక్‌పై వెళ్తూ ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అలాగే సినీ నటులు కోట శ్రీనివాస రావు కుమారుడు, బాబూ మోహన్ కుమారుడు కూడా ఇటువంటి దుర్ఘటనలలోనే మరణించారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...