Tuesday 16 February 2016

లోక్ పాల్ బిల్లుకు కేబినెట్ ఆమోదం


లోక్ పాల్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
గురువారమే లోక్ సభ ముందుకు లోక్ పాల్ బిల్లు,
ఇదేం లోక్‌పాల్, ఇక ఆందోళనే : అన్నా హజారే
న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20 : లోక్ పాల్ బిల్లుకు మంగళవారం సాయంత్రం కేబినెట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును ప్రభుత్వం గురువారంనాడు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రధాన మంత్రిని లోక్ పాల్ పరిధిలోకి తీసుకువచ్చారు. సి.బి.ఐ.ని లోక్ పాల్ బిల్లు పరిధిలోకి తీసుకువచ్చినా ఇంకా ఆ సంస్థ నియంత్రణ మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉంటుందని తెలుస్తున్నది. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి సి.బి.ఐ. డైరెక్టర్‌ను ఎంపిక చేస్తారు. ప్రత్యేకమైన ఫిర్యాదులు ఏమీ అందకపోతే లోక్ పాల్ ఏ రకమైన విచారణనూ చేపట్టడానికి అవకాశం ఉండదు. ఈ ముసాయిదా ప్రకారం లోక్ పాల్‌కు రాజ్యాంగ హోదా లభిస్తుంది. లోక్ పాల్‌ను తొలగించాలంటే పార్లమెంటులో అభిశంసన వల్ల మాత్రమే సాధ్యం.
అయితే ప్రభుత్వం రూపొందించిన బిల్లు ముసాయిదా గురించి వింటున్న సమాచారం నిజమే అయితే ఈ ముసాయిదా పౌర సమాజం కోరుకున్నట్టు లేదని అన్నా హజారే ఆక్షేపించారు. ముందుగా ప్రకటించినట్టు 27న ఆందోళనకు సన్నధ్ధమవుతున్నట్టు కూడా అన్నా ప్రకటించారు. ముందుగా అనుకున్నట్టే 27నుంచి మూడు రోజులపాటు దీక్ష, 30 వ తేదీన జైల్ భరో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపు ఇచ్చారు. లోక్ పాల్‌ను మొత్తం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. సి.బి.ఐ. ని గనక లోక్ పాల్ క్రిందికి తీసుకురాకపోతే అసలు ప్రజలు ఎందుకు ఆందోళన చేసినట్టు అని పౌర సమాజ ప్రతినిధి కిరణ్ బేది ప్రశ్నించారు.
అన్నా కోరినట్టే పార్లమెంటు సమావేశాలను మరి మూడు రోజుల పాటు పొడిగించడానికి వీలుగా కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకోనున్నది. అయితే ఇప్పటికిప్పుడు శీతాకాల సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయించడం మంచిది కాదని బి.ఎస్.పి, శివసేనలతో పాటు ఈశాన్య రాష్ట్రాల ఎం.పి.లు కూడా గట్టిగా భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
అవసరమైతే పార్లమెంటు సమావేశాలను పొడిగించి అయినా సరే, ఈ సారి సమావేశాలలోనే లోక్ పాల్ బిల్లుకు మోక్షం కలిగించాలని అన్నా హజారే ప్రభుత్వాన్ని డిమాండు చేసిన విషయం తెలిసిందే. లోక్ పాల్ పరిధిలోకి సి.బి.ఐ.ని తీసుకువచ్చే విషయమై తలెత్తిన ప్రతిష్టంభన కొంత మేరకు సడలినట్టు తెలుస్తున్నది. లోక్ పాల్ బిల్లు ముసాయిదాపై కేంద్ర మంత్రివర్గం మంగళవారం నాడు సమావేశం కానున్నది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను ముందు చూశాక గాని ఆందోళన గురించి ఏమీ నిర్ణయించలేమని పౌర సమాజం ప్రతినిధులలో ఒకరైన కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఈ సమావేశం సోమవార ంనాడే జరుగుతుందని తొలుత భావించారు. అయితే అన్నా హజారే కోరుతున్నట్టుగా సి.బి.ఐ.ని కూడా లోక్ పాల్‌లో చేర్చాలన్న అంశంపై ప్రభుత్వంలోని పెద్దలు సోమవారం సాయంత్రానికి కూడా ఇంకా మల్లగుల్లాలు పడుతుండడంతో కేబినెట్ సమావేశం వాయిదా పడింది. పౌర సమాజం కోరుతున్నట్టు ప్రభుత్వం గనక గట్టి లోక్‌పాల్ బిల్లుకు రూపకల్పన చేసినట్టయితే తాము ఆందోళనలు చేపట్టనక్కరలేదని అన్నా హజారే ముందే వ్యాఖ్యానించారు. లోక్ పాల్‌తో పాటే మరి రెండు బిల్లులు కూడా ఈ సారి సమావేశాలలో లోక్ సభ ముందుకు రానున్నట్లు తెలుస్తున్నది.
లోక్ పాల్ విషయంలో పార్లమెంటు సమావేశాలను మరి మూడు రోజులపాటు పొడిగించడాన్ని బి.ఎస్.పి, శివసేనలు అంగీకరించడంలేదు. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎం.పి.లు కూడా పార్లమెంటు సమావేశాల పొడిగింపు పట్ల సానుకూలంగా లేరని తెలుస్తున్నది. ఇప్పుడు వారందరినీ ఒప్పించడం ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...